Thursday, August 13, 2015

రాని వర్షం కోసం....

కాలిఫోర్నియా వచ్చిన గత కొద్ది నెలలుగా  ఒకే ఒక్క మాట వినిపిస్తుంది " కరువు" . ఆ మాట వినగానే వర్షం కోసం మనస్సు ఇంకా పరితపిస్తుంది .

రాని వర్షం కోసం నేను, కాగితప్పడవలు వేయటానికి పిల్ల కాలువల కోసం మా అమ్మాయి రోజు ఎదురు చూస్తున్నాము 

వర్షం అంటే నాకు చాలా ఇష్టం. అయినా వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ??

చిట పట చినుకులతో  మేనిని తాకి పరిసరాలని మైమరపింప చేసే వర్షం
తనతో పాటు  మనస్సుని పులకరింపచేసే ఆ మట్టి  వాసన తెచ్చే వర్షం
"ఇంత వర్షంలో బడికి  వద్దులె " అని అమ్మతో అనిపించే  వర్షం 
"వాన వాన వల్లప్ప" అని పిల్లలచే ఆడించే వర్షం
అందమైన నెమలితో నాట్యం చేయించే   వర్షం
చెట్లు  పశు పక్ష్యాదుల దాహార్తిని తీర్చే  వర్షం  
కన్నీళ్ళను   కనిపించకుండా తనతొ కలిసిపొయేలా చేసే వర్షం అంటే ఎవరికైనా ఇష్టమె.   

నీతో కాసేపు కలిసి తిరగాలని చేసిన కాగితప్పడవలని ముంచేసావు
స్నేహితులతో  ఆరు బయట ఆడుకుందామనుకుంటే  వాకిలిని బురదతో నింపేసావు  
నీ చిట పట చినుకుల్లో చిందేయాలని వస్తే , నీ ఉరుముల గర్జనలతో భయపెట్టావు
సంక్రాంతి పండుగకి  అమ్మ ఎంతో కష్టపడి  వేసిన ముగ్గుని చెరిపేసావు  

అయినా కూడా నువ్వంటే నాకు ఇష్టం.  అయినా వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు  ??