Monday, February 25, 2013

స్త్రీ

ఏకమై రెండు మనస్సులు 
మూడు ముళ్ళ బంధం తో 
నాలుగు వేదాలు చదివి 
పంచ భూతాల  సాక్షిగా 
అరుంధతి ని చూసి 
ఏడడుగులు వేసి 
ఎనిమిది తొమ్మిది నెలలు మోసి 
పదిలంగా కనేది  స్త్రీ .. 




Saturday, February 23, 2013

ఆనంద భాష్పం


ప్రియా ,

మరు జన్మంటూ ఉండి , 
నీ సఖి గా ఉండే అవకాశం లేకపోతే 
నీ కంట ఆనంద బాష్పాన్నై జన్మించి
నీ చెక్కిలి ఫై జీవించి
నీ అధరాల  ఫై మరణిస్తాను







Thursday, February 21, 2013

నా బాల్యం నాకిచ్చేయ్

ఈ రోజు తెల్లవారు జామున ఒక మంచి కల.. కలలో నా చిన్ననాటి స్నేహితురాలు ఇంద్రరేఖ .. 21 సంవత్సరాలు అవుతుంది తనని చివరిసారి చూసి.   బాల్యం లో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.  కలలో వచ్చింది కాసేపే అయినా ఉదయం నుండి నా  ఆలోచనలు అన్ని నా  బాల్యం, అప్పుడు చేసిన అల్లరి పనులు, అమ్మ ప్రేమ, బడి ముచ్చట్లు చుట్టే తిరుగుతున్నాయి. నిజంగా ఒక కాల యంత్రం ఉండి మళ్లీ  బాల్యపు రోజులకి వెళితే ఎంత బావుంటుందో కదా ..!

ఉందో లెదో స్వర్గం
...నా పుణ్యం నాకిచ్చెయ్

సర్వస్వం నీకిస్తా
...నా బాల్యం నాకిచ్చేయ్

అమ్మ గుండెలొ దూరి
...అనందంతొ తుల్లి
ఆద మరిచి నిదరోయె
...ఆ సౌఖ్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు
...బ్రహ్మ వేదాలు బందు
ముక్తి కేలనె మనసా
...బాల్యం కోసం తప్పస్సు చేయ్





నిన్న ఏదో వెబ్ పత్రిక లో ఈ  కవిత చదివాను. అందుకే ఇలాంటి కల వచ్చిందేమో . అందుకే నా ఈ  రోజు టపా లో మీకోసం ఆ కవిత కూడా .. నాలాగే మీరు కూడా మీ చిన్ననాటి మధుర స్మృతులని గుర్తు తెచ్చుకోండి. 

Saturday, February 16, 2013

ప్రియరాగాలు


ప్రియతమా..
నా  మనసు నీకై ప్రియరాగాలు ఆలపిస్తుంది.
నువ్వు ఎంత దూరంలోనున్నా  నా హృదయ పరిధి దాటిపోలేవు
నీ రూపం నా కన్నులతో చూసి నాలో నిను  పూర్త్తిగా నింపాను 
నా మూగ నవ్వు  నువ్వు  గుర్తించే దేనాడు 
నీ ప్రేమామృత ధారలు  నా పై కురిసే దేనాడు


Friday, February 15, 2013

మనస్సే పాడేనులే


"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"  సినిమా చూసినప్పటి నుండి, ఆ పాట వినప్పటినుండి ,  చిన్నతనంలో నా స్నేహితుల తో కలిసి  పాడుకున్న ఈ పాట మనస్సులో మెదులుతూనే ఉంది. 


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు


అనుకోకుండా ఒక రోజు

UK లో 2 నెలలు పర్యటన తరువాత భారత దేశం వెళ్తున్నాను. వాతావరణ కారణాల వల్ల హీత్రో విమానాశ్రయం నుండి విమానం చాలా ఆలస్యంగా బయల్దేరింది. చాలా సేపు విమాశ్రయం లో వెయిట్ చేయటం , విమానం ఆలస్యం అవటం వల్ల ప్రయాణం చాలా చిరాకుతో మొదలయ్యింది. సరేలే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆనందించే లోగా దుబాయ్ లో హైదరాబాద్ కి వెళ్ళాల్సిన విమానం మిస్స్ అయ్యాము అని తెలిసింది. 
మళ్ళీ దుబాయ్ విమానాశ్రం లో చాల గంటల నిరీక్షణ తరువాత ఇక ఆరోజు దుబాయ్ లో ఉండాల్సిందే,  మరో 14 గంటల వరకు ఇంకో విమానం హైదరాబాద్ వెళ్ళటం లేదు అని చెప్పి, హోటల్ గట్రా  బుక్ చేసి , అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. 

ఉదయం 5 కావొస్తుంది.. నిల్చున్నే చోటే అలాగే నిద్రపోతే బావుండనిపించింది .. మిగతా ప్రయాణికులతో పాటు  కాళ్ళు , మనస్సు ఈడ్చుకుంటూ హోటల్ కి వెళ్ళాను. నాన్న కి కాల్ చేసి, ఇక ఈ రోజుకి రావటం లేదు అని చెప్పాను.. నా  గొంతులో దిగులు కనిపెట్టిన నాన్న ఇంకేమి ఇంత మంచి అవకాశం, దుబాయ్ చూసేసి వచ్చేయి అన్నారు. దుబాయ్ చూడటం కాదు కదా, కళ్ళు తెరిచి కాసేపు కూర్చునే ఓపిక కూడా లేకపోయింది.  దుబాయ్ చూడటం వద్దు ఏమి వద్దు, చక్కగా ముసుగు తన్ని నిద్రపోతే చాలు, ఇక ఈ జీవితానికి ఏమి అక్కర్లేదు అనిపించింది. కానీ మళ్ళీ  నాన్న మాటలు గుర్తొచ్చి, నిద్రని, మనస్సుని స్వాదీనంలోకి తెచ్చుకుని, వెళ్లి హోటల్ మేనేజర్ తో మాట్లాడి దుబాయ్ చూడటానికి ఒక గైడ్, కారు ఏర్పాటు చేసుకున్నాను.  గైడ్ రావటానికి ఇంకా 3 గంటలు ఉండటం తో, వెళ్లి అలారం పెట్టుకుని చక్కా  నిద్రపోయాను.

 9 కి హోటల్ దగ్గర మొదలయ్యింది మా ప్రయాణం.  అలా ఆ రోజంతా దుబాయ్ లో  చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమయిన ప్రదేశాలన్నీ చూసేసాను. చెన్నై లో సముద్రతీరం చాలాసార్లు చూసాను. కానీ దుబాయ్ లో ఆ  సముద్రతీరం ఎంత అందంగా ఉందంటే కాసేపు  కల్లార్పటం మర్చిపోయానంటే  నమ్మండి. అలాగే ఎంతో ఎత్తయిన భవనాలు , షాపింగ్ మాల్స్ కన్నుల పండుగ  లా  ఉండింది.   ఒకటే చిక్కల్లా ఎండ . విపరీతమయిన వేడి.. అస్సలు కారు దిగితే చాలు ఆ ఎండ కి కళ్ళలో నుండి ఆగకుండా నీరు...కాసేపు ఏ  చెట్టు కిందో నిల్చుందామంటే  ఖర్జూర చెట్టు కాకుండా మరో చెట్టు కనిపిస్తే వొట్టు ..ఎవరో తిడితే ఏడ్చినట్టు,  కళ్ళ నిండా నీరు, ఏడుపు మొహం వేసుకుని అలసిపోయిన ముఖం తో అలా అనుకోకుండా ఒక రోజు దుబాయ్ చూసానన్నమాట. 






Monday, February 11, 2013

కొత్త పోకడలు

విల విల లాడింది Originality
పల్చబడి పోయింది Personality
 కొత్త పోకడల  Curiosity లో
నలిగి పోయింది Naturality.





చాలా సంవత్సరాల క్రితం ఒక వార పత్రిక లో చదివాను. ఒకసారి చదవగానే చాలా  నచ్చింది , అలా గుర్తుండిపోయింది.  చదివాక  కవి భావ వ్యక్తీకరణ ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. ఎంత  చిన్నగా, సరళమయిన పదాలు ఉపయోగించి రాసారు, అయినా చదువుతుంటే అందులో ఎంతో అర్ధం ఉన్నట్టు అనిపించింది. 

Thursday, February 7, 2013

గాల్లో తేలినట్టుందే..

2008 ఆగస్టు మాసం..అప్పుడు చికాగో కి నేను కొత్తగా వచ్చిన రోజులు . ఒక రోజు  నేను నా స్నేహితురాలు ఒక సినిమా చూసి స్కై డైవింగ్ గురించి తెలుసుకున్నాము. తెలుసుకోవటం ఆలస్యం ఇక ఆ వారంతం స్కై డైవింగ్ చేసేయల్సిందే అని నిశ్చయించుకున్నాం .

ఆదివారం ఉదయం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఉదయాన్నే కారు లో బయల్దేరి గంట ప్రయాణం చేసి చికాగోలాండ్ స్కై డైవింగ్ సెంటర్ కి చేరుకున్నాము. ముందుగానే అప్పాయింట్మెంట్ తీసుకోవటం వల్ల పెద్దగా నిరీక్షణ లేకుండానే మా పేర్లు పిలిచారు.

మా పేర్లు వినగానే గుండె కొంచెం వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. రక్షణ కోసం ఒక సూట్ ఇచ్చి వేసుకోమన్నారు.  నా ఇన్స్ట్రక్టర్ స్టీవ్ వచ్చి రూల్స్ , జాగ్రత్తలు  చెప్పి విమానం దగ్గరికి తీసుకెళ్ళాడు.DHC -6 సూపర్ స్పిన్ ఒటర్ విమానం , మా కోసం సిద్దంగా ఉంది. నేను, స్టీవ్ మరికొంతమంది టన్దెమ్ స్కై డైవ్ చేయటానికి వచ్చినవాళ్లు   ఉత్సాహంగా విమానం ఎక్కాము .

విమానం 18000 అడుగుల  ఎత్తులో ఎగురుతోంది. ఒకవైపు స్కై డైవ్  చేస్తున్న ఆనందం ఉన్నా , కొంచెం భయపడకుండా  ఉండలేకపోయాను. ఇక దూకేయటానికి మా వంతు రాగానే, దైర్యం కూడగట్టుకుని డోర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాము.

భూమి కి 3 మైళ్ళ ఎత్తులో నిల్చుని దూకేయటానికి సిద్దంగా  ఉన్నప్పుడు ప్రపంచం లో ఇక ఏ  పని అయినా చేసేయగలను అనిపించింది. స్టీవ్ రెడీ జంప్ అనగానే దూకేసాను. మాతో పాటు మా ఫోటోగ్రాఫర్  కూడా.

చల్ల గాలి లో అలా వేగంగా కిందికి వెళ్తుంటే నిజంగా గాలిలో తేలినట్టయ్యింది . ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .

దూకేయగానే మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు  తీయటం స్టార్ట్ చేసాడు. అంత ఎత్తునుండి దూకి, ఎంతో వేగం తో కిందికి వెళ్తున్నప్పుడు,  అస్సలు ఫోటోలు ఎలా తీయగలుగుతున్నాడు అని చాల ఆశ్చర్యం వేసింది.

ఒక నిమిషం ఫ్రీ ఫాల్ తరువాత స్టీవ్ పారాచూట్ వోదిలాడు .. ఇక నెమ్మది గా కిందికి మా పయనం మొదలయ్యింది.అల గాల్లో కాసేపు విహరించి  పారాచూట్  ఎలా ఆపరేట్ చేయాలో చూపించాక ఇక ల్యాండ్ అయ్యాము.

ఆకాశం లో 18000 అడుగుల  ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి అమాంతం దూకేయటం లో కలిగిన థ్రిల్ నిజంగా ఎప్పటికి మర్చిపోలేను.





మమకారపు పరిమళం


కనుల చివర కాంతి సంగీతాలని తెలుపుతూ
పెదవులపై  తెల్లని నవ్వుల వీణల్ని  మీటుతూ
అంతరంగం లో అనురాగపు గానాన్ని ఆలపించుతూ
నీవు నాతో మాట్లాడినప్పుడు
నీ ముంగురుల నుండి వెదజల్లిన
నీ మమకారపు పరిమళం నా మనస్సుని తాకి
నీవు నాకు కావాలని తెలిపినది





Wednesday, February 6, 2013

చైనా గ్రేట్ వాల్

ప్రపంచ వింతలు అనగానే మొదటగా నాకు గుర్తొచ్చేది చైనా మహా కుడ్యం  ( చైనా గ్రేట్  వాల్ )

నా చిన్నతనం లో పుస్తకాల్లో  మింగ్ రాజవంశీయులు , వారు మంగోలుల బారి నుండి చైనా ఉత్తర సరిహద్దులను కాపాడటానికి  గొప్పగా నిర్మించిన చైనా మహా కుడ్యం గురించి చదివినప్పటి నుండి చైనా వెళ్ళాలి, ఆ మహా కుడ్యం చూడాలి అని చాలా కోరికగా ఉండేది.

2006 మార్చ్ మాసం.. నా చైనా పర్యటన నిశ్చయం కాగానే, నా ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడెప్పుడు చైనా వెళ్దామా, గ్రేట్ వాల్ ఎప్పుడు చూద్దామా అని మనస్సు ఉవ్విళ్ళూరింది  .

చైనా వెళ్ళింది ఏమో ఆఫీసు పని మీద.. ఆఫీసు పని తో నాకు వెంటనే గ్రేట్ వాల్ చూడటానికి వెళ్ళటం కుదరలేదు.. ఇక వారంతం రాగానే మా టీం ఒక కారు బాడుగ కి తీసుకుని, ఒక గైడ్ తో చైనా గ్రేట్ వాల్ చూడటానికి బీజింగ్ నుండి బయల్దేరాము.

బీజింగ్ నుండి బదాలింగ్ 2 గంటల ప్రయాణం.  కారు నుండి దిగగానే, ఎంతో అందంగా ఠీవీ గా కనిపించింది చైనా గ్రేట్ వాల్. కాళ్ళు నొప్పిపెట్టేవరకు అలా వాల్ పై నడుస్తూ ఉండిపోయాను.5 వేల మైళ్ళ పొడువున్న గ్రేట్ వాల్ మొత్తం చూడటం కుదరదు కదా.. 

చల్లని గాలిలో అలా ఓ రెండు  గంటల పాటు ఎంతో చరిత్ర కలిగిన గ్రేట్ వాల్ మీద నడవటం నిజంగా మర్చిపోలేని అనుభూతి.


మంచు కురిసే వేళలో


ఆదివారం ..ఎంత ఇష్టమో నాకు..

ప్రతిరోజులా ఉదయాన్నే లేచి హడావిడిగా ఆఫీసు కి వెళ్లక్కరలేదు ..

చక్కగా ఆలస్యంగా లేచి నిదానంగా పనులు చేసుకోవచ్చు :)

అలా బద్దకంగా లేచి కిటికీల్లోంచి బయట ప్రపంచం ఎలా ఉందో  చూడ్డానికి ప్రయత్నించాను. ఏ కిటికీలోంచి చూసిన తెల్లని మంచు తప్ప ఏమి కనిపించలేదు. 

ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా తెల్లని మంచు కురుస్తూనే ఉంది.

56 వ అంతస్తు నుండి సన్నగా, తెల్లగా పక్కన ఉన్న ఎత్తైన ఇళ్ళని కప్పేస్తూ కురుస్తున్నమంచు చూడటానికి ఎంత బాగుందో.

ఒక కప్పు కాఫీ తీసుకుని వచ్చి కిటికీ పక్కన కూర్చుని  మంచులో తడిసిన చికాగో నగర   వైభవాన్ని తనివితీరా కన్నులలో నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయాను.

కాసేపట్లో చుట్టూ దుప్పటిలా పరుచుకుంది  తెల్లని మంచు.

అలా టన్నుల కొద్ది తెల్ల దూది చల్లినట్టు ఎటు చూసినా కను చూపు మేర వరకు పడుచుకున్న తెలతెల్లటి మంచుని మొదటిసారి  చూడటం  మరపురాని అనుభూతి 




Monday, February 4, 2013

ఋతురాగాలు



నా చిన్నతనం లో దూరదర్శన్ లో  ఋతురాగాలు  అని ఒక ధారావాహిక ప్రసారం అయ్యేది.
ఈ ధారావాహిక అంటే మా అమ్మ కి ఎంతో ఇష్టం ఉండేది . సాయంత్రం నాలుగు అయ్యిందంటే అరగంట పాటు టీవీ కి అతుక్కుపోయేది. ధారావాహిక సంగతేమో కానీ, నాకు టైటిల్ సాంగ్ తెగ నచ్చేది. రోజు ఆ పాట ప్రసారం అయినంత  సేపు తప్పకుండా  చూసేదాన్ని. ఇప్పటికి ఏ ఋతువు పేరు విన్నా ఈ పాటే గుర్తొస్తుంది .


వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా 
శరత్చంద్రికల కల లా..
హేమంత తుషారం లా
నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ

సాగే జీవన గానం అణువణువున ఋతురాగం


మధురోహ మాలికలు


తుషారపు జల్లులు కావవి మంచి ముత్యపు చినుకులు
మంచుదిబ్బల్లు కావవి మలచని పరుపు దొంతరలు


పిల్లగాలి పిలుపులు కావవి గండు కోయిలల పలుకులు
నీలిమబ్బు విరుపులు కావవి నింగిన మెరిసిన తారకలు


పక్షుల కిలకిలరావములు కావవి పసిపాప నవ్వుల కేరింతలు
పచ్చని పసిరికలు కావవి తడిసిన పసిడి వన్నెల కాంతులు


మదినూహించినవి కావివి మదినిడిన దృశ్యమాలికలు
మధురోహలతో లిఖించిన అదృశ్య వర్ణవీచికలు



నా బ్లాగ్ కోసం నా స్నేహితురాలు కల్పన పంపించింది. 

Friday, February 1, 2013

ఆకాశమే హద్దు

అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు 

అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు 


పోరాడు ...పోట్లాడు...జీవితమను ఆటాడు...గెలుపును వేటాడు.....






ఎక్కడ చదివానో గుర్తు లేదు.. కానీ బావుంది కదా :)

పుట్టిన రోజు పండగే అందరికి

నిజంగా పుట్టిన  రోజు అంటే పండగే  కదా అందరికి...

 పోయిన వారం నా స్నేహితురాలు  వాళ్ళ పాప ప్రణవి  పుట్టిన రోజు వేడుక కి వెళ్లాను.

రంగు రంగుల బలూన్ లతో , కాగితాలతో అందంగా ముస్తాబు చేసిన గది లో  , తల్లితండ్రులు , బందుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది ప్రణవి  పుట్టినరోజు వేడుక .

పింక్ ఫ్రాక్  లో చూడముచ్చట గా ఉన్న చిన్నారి తల్లి ప్రణవి ఇలాగే అందంగా, ఆరోగ్యంగా, సుఖశాంతులతో వంద పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాను .










భోగి పళ్ళు

ఇంట్లో చిన్నారులుంటే  సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది భోగి పళ్ళు .

భోగి పండగ రోజు చిన్నారులందరికి  భోగి పళ్ళు పోయటం మన ఆనవాయితి .

సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో, శనగలు, పూలు, చెరుకుగడలు, నాణేలను  కలిపి  కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా తలపై పోసి దిష్టి తొలగిస్తారు .

ఆ పళ్లు పోస్తే  సూర్యదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అంటారు,అంతేకాక ఆ  పళ్లు తలమీద నుంచి పోస్తారు అలా పోస్తే అవి జారి కిందకు పడతాయి అందువల్ల శరీరం అంతా సూర్యుడి శక్తి లభిస్తుందని ప్రతీతి.

మా ఇంట్లో ఈ సంవత్సరం వేద కి ఆర్య కి అమ్మమ్మ  తాతయ్య దగ్గరుండి భోగి పళ్ళు పోసారు .











మొహసాగరం





నా  మది మేఘాల  రథమెక్కి ,  నీలి  గగనాన  పయనిస్తూ 

 ప్రేమ వానగా  మరి , జల్లు  జల్లు  గా  కురిసి నిన్ను  తడపాలని  ఉంది
  
నా  ఎద  విరిసిన  విరియయి , అనురాగ  సౌరభాలు  గుభాలిస్తూ 

గాలి  అలలపై  చేరి , నిన్ను మైమరిపించాలని   ఉంది

నా హృది  సుమధుర  మధువు  గా మారి , నీ  దరహాస  ఆదరాన   చేరి

ప్రియతమా  మొహసాగరంలో , నిన్ను ముంచాలని  ఉంది