Friday, February 15, 2013

అనుకోకుండా ఒక రోజు

UK లో 2 నెలలు పర్యటన తరువాత భారత దేశం వెళ్తున్నాను. వాతావరణ కారణాల వల్ల హీత్రో విమానాశ్రయం నుండి విమానం చాలా ఆలస్యంగా బయల్దేరింది. చాలా సేపు విమాశ్రయం లో వెయిట్ చేయటం , విమానం ఆలస్యం అవటం వల్ల ప్రయాణం చాలా చిరాకుతో మొదలయ్యింది. సరేలే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆనందించే లోగా దుబాయ్ లో హైదరాబాద్ కి వెళ్ళాల్సిన విమానం మిస్స్ అయ్యాము అని తెలిసింది. 
మళ్ళీ దుబాయ్ విమానాశ్రం లో చాల గంటల నిరీక్షణ తరువాత ఇక ఆరోజు దుబాయ్ లో ఉండాల్సిందే,  మరో 14 గంటల వరకు ఇంకో విమానం హైదరాబాద్ వెళ్ళటం లేదు అని చెప్పి, హోటల్ గట్రా  బుక్ చేసి , అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. 

ఉదయం 5 కావొస్తుంది.. నిల్చున్నే చోటే అలాగే నిద్రపోతే బావుండనిపించింది .. మిగతా ప్రయాణికులతో పాటు  కాళ్ళు , మనస్సు ఈడ్చుకుంటూ హోటల్ కి వెళ్ళాను. నాన్న కి కాల్ చేసి, ఇక ఈ రోజుకి రావటం లేదు అని చెప్పాను.. నా  గొంతులో దిగులు కనిపెట్టిన నాన్న ఇంకేమి ఇంత మంచి అవకాశం, దుబాయ్ చూసేసి వచ్చేయి అన్నారు. దుబాయ్ చూడటం కాదు కదా, కళ్ళు తెరిచి కాసేపు కూర్చునే ఓపిక కూడా లేకపోయింది.  దుబాయ్ చూడటం వద్దు ఏమి వద్దు, చక్కగా ముసుగు తన్ని నిద్రపోతే చాలు, ఇక ఈ జీవితానికి ఏమి అక్కర్లేదు అనిపించింది. కానీ మళ్ళీ  నాన్న మాటలు గుర్తొచ్చి, నిద్రని, మనస్సుని స్వాదీనంలోకి తెచ్చుకుని, వెళ్లి హోటల్ మేనేజర్ తో మాట్లాడి దుబాయ్ చూడటానికి ఒక గైడ్, కారు ఏర్పాటు చేసుకున్నాను.  గైడ్ రావటానికి ఇంకా 3 గంటలు ఉండటం తో, వెళ్లి అలారం పెట్టుకుని చక్కా  నిద్రపోయాను.

 9 కి హోటల్ దగ్గర మొదలయ్యింది మా ప్రయాణం.  అలా ఆ రోజంతా దుబాయ్ లో  చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమయిన ప్రదేశాలన్నీ చూసేసాను. చెన్నై లో సముద్రతీరం చాలాసార్లు చూసాను. కానీ దుబాయ్ లో ఆ  సముద్రతీరం ఎంత అందంగా ఉందంటే కాసేపు  కల్లార్పటం మర్చిపోయానంటే  నమ్మండి. అలాగే ఎంతో ఎత్తయిన భవనాలు , షాపింగ్ మాల్స్ కన్నుల పండుగ  లా  ఉండింది.   ఒకటే చిక్కల్లా ఎండ . విపరీతమయిన వేడి.. అస్సలు కారు దిగితే చాలు ఆ ఎండ కి కళ్ళలో నుండి ఆగకుండా నీరు...కాసేపు ఏ  చెట్టు కిందో నిల్చుందామంటే  ఖర్జూర చెట్టు కాకుండా మరో చెట్టు కనిపిస్తే వొట్టు ..ఎవరో తిడితే ఏడ్చినట్టు,  కళ్ళ నిండా నీరు, ఏడుపు మొహం వేసుకుని అలసిపోయిన ముఖం తో అలా అనుకోకుండా ఒక రోజు దుబాయ్ చూసానన్నమాట. 






No comments:

Post a Comment