Thursday, February 7, 2013

గాల్లో తేలినట్టుందే..

2008 ఆగస్టు మాసం..అప్పుడు చికాగో కి నేను కొత్తగా వచ్చిన రోజులు . ఒక రోజు  నేను నా స్నేహితురాలు ఒక సినిమా చూసి స్కై డైవింగ్ గురించి తెలుసుకున్నాము. తెలుసుకోవటం ఆలస్యం ఇక ఆ వారంతం స్కై డైవింగ్ చేసేయల్సిందే అని నిశ్చయించుకున్నాం .

ఆదివారం ఉదయం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఉదయాన్నే కారు లో బయల్దేరి గంట ప్రయాణం చేసి చికాగోలాండ్ స్కై డైవింగ్ సెంటర్ కి చేరుకున్నాము. ముందుగానే అప్పాయింట్మెంట్ తీసుకోవటం వల్ల పెద్దగా నిరీక్షణ లేకుండానే మా పేర్లు పిలిచారు.

మా పేర్లు వినగానే గుండె కొంచెం వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. రక్షణ కోసం ఒక సూట్ ఇచ్చి వేసుకోమన్నారు.  నా ఇన్స్ట్రక్టర్ స్టీవ్ వచ్చి రూల్స్ , జాగ్రత్తలు  చెప్పి విమానం దగ్గరికి తీసుకెళ్ళాడు.DHC -6 సూపర్ స్పిన్ ఒటర్ విమానం , మా కోసం సిద్దంగా ఉంది. నేను, స్టీవ్ మరికొంతమంది టన్దెమ్ స్కై డైవ్ చేయటానికి వచ్చినవాళ్లు   ఉత్సాహంగా విమానం ఎక్కాము .

విమానం 18000 అడుగుల  ఎత్తులో ఎగురుతోంది. ఒకవైపు స్కై డైవ్  చేస్తున్న ఆనందం ఉన్నా , కొంచెం భయపడకుండా  ఉండలేకపోయాను. ఇక దూకేయటానికి మా వంతు రాగానే, దైర్యం కూడగట్టుకుని డోర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాము.

భూమి కి 3 మైళ్ళ ఎత్తులో నిల్చుని దూకేయటానికి సిద్దంగా  ఉన్నప్పుడు ప్రపంచం లో ఇక ఏ  పని అయినా చేసేయగలను అనిపించింది. స్టీవ్ రెడీ జంప్ అనగానే దూకేసాను. మాతో పాటు మా ఫోటోగ్రాఫర్  కూడా.

చల్ల గాలి లో అలా వేగంగా కిందికి వెళ్తుంటే నిజంగా గాలిలో తేలినట్టయ్యింది . ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .

దూకేయగానే మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు  తీయటం స్టార్ట్ చేసాడు. అంత ఎత్తునుండి దూకి, ఎంతో వేగం తో కిందికి వెళ్తున్నప్పుడు,  అస్సలు ఫోటోలు ఎలా తీయగలుగుతున్నాడు అని చాల ఆశ్చర్యం వేసింది.

ఒక నిమిషం ఫ్రీ ఫాల్ తరువాత స్టీవ్ పారాచూట్ వోదిలాడు .. ఇక నెమ్మది గా కిందికి మా పయనం మొదలయ్యింది.అల గాల్లో కాసేపు విహరించి  పారాచూట్  ఎలా ఆపరేట్ చేయాలో చూపించాక ఇక ల్యాండ్ అయ్యాము.

ఆకాశం లో 18000 అడుగుల  ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి అమాంతం దూకేయటం లో కలిగిన థ్రిల్ నిజంగా ఎప్పటికి మర్చిపోలేను.





1 comment: